రెడ్డి గర్జన సభలో నాపై హత్యయత్నం: మల్లారెడ్డి

ఆదివారం ఘాట్‌కేసర్‌లో జరిగిన రెడ్డి గర్జన సభలో తన కాన్వాయ్‌పై కొందరు చెప్పులు, కుర్చీలు విసిరి దాడి చేయడాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి హత్యాప్రయత్నంగా అభివర్ణించారు. “గత 8 ఏళ్ళుగా రేవంత్‌ రెడ్డి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. నిన్న జరిగిన సభలో నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. నాపై దాడి చేసినవారు ఆయన అనుచరులే. వారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. వారితో నన్ను హత్య చేయించేందుకు కుట్ర పన్నిన రేవంత్‌ రెడ్డిని కూడా జైలుకి పంపిస్తాను,” అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన మంత్రులలో ఒకరిగా చెప్పుకోబడుతున్న మల్లారెడ్డి తనను పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రేవంత్‌ రెడ్డి ఎనిమిదేళ్ళుగా వేధిస్తున్నట్లయితే ఇంతకాలం ఆయన ఎందుకు సిఎం కేసీఆర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు?  

వాస్తవానికి సభలో జరిగిందేమిటంటే, రెడ్డి కుల పెద్దలు టిఆర్ఎస్‌ ప్రభుత్వం రూ.5,000 కోట్లతో ఏర్పాటు చేస్తానన్న రెడీ కార్పొరేషన్ గురించి ప్రశ్నించినప్పుడు, ఆయన దానికి సమాధానం చెప్పకుండా దళిత బంధు, రైతు బంధు పధకాల గురించి మాట్లాడుతుందటంతో సభలో వేదికపై కూర్చోన్నవారితో సహా అందరిలో అసహనం మొదలైంది. అయితే మంత్రి మల్లారెడ్డి అది పట్టించుకోకుండా తన ధోరణిలో తాను సాగిపోతుండటంతో, సభకు వచ్చిన రెడ్డి కులస్థులు లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డారు. దాంతో ఆయన కూడా సహనం కోల్పోయి వారితో వాగ్వాదానికి దిగడంతో వారు మరింత ఆవేశంగా “మల్లారెడ్డి డౌన్ డౌన్‌లోడ్‌..”అంటూ నినాదాలు చేశారు. 

దాంతో ఆయన అర్ధాంతరంగా తన ప్రసంగాన్ని ముగించి కాన్వాయ్‌లో వెళ్ళిపోతుండగా, ఆవేశం ఆపుకోలేని నిరసనకారులు కాన్వాయ్‌ వెంటపడి చెప్పులు, ప్లాస్టిక్ కుర్చీలు విసిరారు. దానినే మంత్రి మల్లారెడ్డి హత్యాయత్నంగా చెపుతున్నారు. 

అయినా కులసభకు హాజరైనప్పుడు వారు ప్రస్తావించిన అంశాల గురించే మాట్లాడాలి కానీ అదేదో ఎన్నికల సభ అన్నట్లు టిఆర్ఎస్‌ ప్రభుత్వం గొప్పల గురించి చెప్పుకొంటే వారికి మండదా?మంత్రిపై భౌతికదాడిని ఎవరూ సమర్ధించరు కానీ దానిని ఆయన హత్యాయత్నంగా అభివర్ణించడం, దాని వెనుక రేవంత్‌ రెడ్డి హస్తం ఉందన్నట్లు ఆరోపించడాన్ని కూడా ఎవరూ సమర్దించరు. రేపు రేవంత్‌ రెడ్డి అందుకు సాక్ష్యాధారాలు చూపాలని కోరుతూ కోర్టులో కేసు వేస్తే అప్పుడు ఇబ్బంది పడేది ఆయనే!