తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కాన్వాయ్‌పై ఘాట్‌కేసర్‌లో దాడి జరిగింది. ఆదివారం సాయంత్రం ఘాట్‌కేసర్‌లో జరిగిన రెడ్డి సింహ గర్జన సభకు హాజరయ్యారు. ముందుగా సభలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్దలు ఉపన్యసించారు. వారు తమ ప్రసంగాలలో గత ఎన్నికలలో టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ.5,000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిందని కానీ ఇంతవరకు ఆ హామీ నిలబెట్టుకోలేదని మంత్రి మల్లారెడ్డికి సభాముఖంగానే తెలియజేశారు.
వారి తరువాత ప్రసంగించిన మంత్రి మల్లారెడ్డి, వారు ప్రస్తావించిన ఈ విషయం గురించి మాట్లాడకుండా సిఎం కేసీఆర్ రైతు బంధు, రైతు భరోసా, దళిత బంధు పధకం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం అమలుచేస్తున్నారంటూ మాట్లాడుతుండటంతో సభకు హాజరైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఇక మాట్లాడవద్దని కేకలు వేయడం మొదలుపెట్టారు. దాంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగం మద్యలో ఆపేసి వేదిక దిగి వెళ్ళిపోయారు.
ఆయన తన కారువద్దకు వెళుతుండగా వారు ఆయనను చుట్టుముట్టి ‘మల్లారెడ్డి డౌన్ డౌన్..మల్లారెడ్డి...గోబ్యాక్” అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గ్రహించిన పోలీసులు అతి కష్టం మీద ఆయనను కారు వద్దకు తీసుకువెళ్ళారు. ఆయన కారులో కూర్చోన్న తరువాత కొందరు ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, కుర్చీలు విసిరారు. పోలీసుల సాయంతో మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డారు.
అనంతరం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన అనుచరుల చేత నాపై ఈ దాడి చేయించాడు. ఆయన తీరును నేను ప్రశ్నిస్తునందునే ఇటుటువంటి కుట్రలకు పాల్పడుతున్నాడు. అయితే ఇటువంటివాటికి నేను భయపడే ప్రసక్తే లేదు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గడంతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటులో రెండేళ్ళు ఆలస్యమైంది. కానీ మా ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకి కట్టుబడి ఉంది. దాని కోసం నేను సిఎం కేసీఆర్‌తో మాట్లాడుతాను,” అని అన్నారు.