
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె. రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ఒంగోలులో మహానాడు సిఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోవడానికే పెట్టుకొన్నట్లు ఉంది తప్ప టిడిపికి ఉపయోగపడే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు తన మావగారికి వెన్నుపోటు పొడిస్తే సిఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఓ జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారు. కనుక చంద్రబాబు మహానాడులో జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతారని అనుకొన్నాను కానీ చంద్రబాబు ఆ రకం కాదు. కనుక జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే పరిమితమయ్యారు.
చంద్రబాబు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ నే బాలకృష్ణ చదివారు తప్ప ఆయనకి సొంతంగా చెప్పే ధైర్యం లేదు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కనుసన్నలలో ఆయన పనిచేస్తున్నారు. ఆయనకే నిజంగా ధైర్యం ఉంటే ఎప్పుడో చంద్రబాబుని వదిలిపెట్టి బయటకు వచ్చేసి ఉండేవారు.
బాలకృష్ణకు చంద్రబాబుని చూస్తే భయం, చంద్రబాబుకి జూ.ఎన్టీఆర్‌ని చూస్తే భయం. చాలా విచిత్రంగా ఉంది. అందుకే చంద్రబాబు జూ.ఎన్టీఆర్‌ను పార్టీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేశారు,” అని రోజా విమర్శలు గుప్పించారు.