
ప్రధాని నరేంద్రమోడీ నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు సిఎం కేసీఆర్ మొహం చాటేసి బెంగళూరు పారిపోయారని బిజెపి నేతలు ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందుకు పూర్తి భిన్నమైన వాదన చేశారు.
గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్ మద్య చక్కటి అవగాహన్ ఉంది కనుకనే మోడీ హైదరాబాద్ వచ్చే సమయానికి కేసీఆర్ బెంగళూరు వెళ్ళిపోయారు. ఒకవేళ అటువంటిదేమీ లేదనుకొంటే కేసీఆర్ హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోడీని కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల, ఇతర సమస్యలపై మాట్లాడి ఉండొచ్చు కదా?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీ చెన్నైకి వచ్చినప్పుడు ఆయనను గౌరవంగా ఆహ్వానించి, రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల, ఇతర సమస్యలపై ప్రజల ఎదుట ఆయన మొహం మీదనే అడిగేశారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆయన కూడా ఆవిదంగా అడిగి ఉండేవారు కదా?
ప్రధాని నరేంద్రమోడీ కూడా రాష్ట్ర సమస్యలు, అవసరాలు, అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించి వెళ్ళిపోయారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే చెపుతున్నప్పుడు మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?అంటే కేసీఆర్తో అవగాహన ఉన్నందునే,” అని అన్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇంచుమించు ఇవే అభిప్రాయాలూ వ్యక్తం చేశారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గనులలో అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ కుంభకోణంలో కేసీఆర్ బంధువు ఒకరు ఉన్నందునే కదా?” అని ప్రశ్నించారు.