ఈరోజు హైదరాబాద్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు సిఎం కేసీఆర్ మొహం చాటేసి బెంగళూరు వెళ్లిపోవడంపై ఆయన సున్నితంగా చురకలు వేశారు.
బేగంపేట విమానాశ్రయం వద్ద బిజెపి నిర్వహించిన సభలో మాట్లాడుతూ, “నేను ఎప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా ఇక్కడి ప్రజలు నన్ను చాలా ఆప్యాయంగా ఆదరిస్తుంటారు. అందుకు నేను ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. టిఆర్ఎస్ పాలన అవినీతిమయంగా మారింది. కుటుంబ పాలనతోనే అవినీతి మొదలవుతుంది. కనుక అవినీతిని అంతమొందించాలంటే కుటుంబ పాలనను, వారసత్వ రాజకీయాలను అంతమొందించాల్సి ఉంటుంది.
వందలాదిమంది ప్రాణాలు బలిపెట్టి పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం ఆ నలుగురి కోసమో వారి కుటుంబం కోసమో కాదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించకుండా టిఆర్ఎస్ పాలన సాగుతోంది. దానీ అంతమొందించేందుకు బిజెపి సిద్దంగా ఉంది. కుటుంబ పాలన, నిరంకుశ వైఖరితో విసుగెత్తిపోయున్న ప్రజలు కూడా మార్పు కోరుకొంటున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో తప్పకుండా ప్రజలు బిజెపిని గెలిపిస్తారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో ఈ రాజకీయ మార్పు తధ్యం.
ఈ 21వ శతాబ్ధంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా మూఢ నమ్మకాలతో పనిచేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది,” అని అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ రెండుసార్లు హైదరాబాద్ వస్తే రెండుసార్లు సిఎం కేసీఆర్ మొహం చాటేశారు. బహుశః అందుకేనేమో తనను చాలా ఆప్యాయంగా ఆదరిస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. మూఢ నమ్మకాలతో ప్రభుత్వం సాగుతోందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పడం, పాత సచివాలయంలో అడుగుపెడితే ముఖ్యమంత్రి పదవి కోల్పోతారనే భయంతో సిఎం కేసీఆర్ సచివాలయంలో అడుగు పెట్టకుండా ప్రగతి భవన్ నుంచే పాలన కొనసాగిస్తుండటంతో, వాస్తుదోషం ఉందని సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మిస్తుండటం, దాని కోసం వాస్తు సలహాదారుని నియమించుకోవడం గురించే అని భావించవచ్చు.
బహుశః ప్రధాని నరేంద్రమోడీ నగరం నుంచి ఢిల్లీ బయలుదేరగానే టిఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించవచ్చు. కనుక మళ్ళీ కొన్ని రోజుల వరకు టిఆర్ఎస్-బిజెపిల మద్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది.