హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. బెంగళూరుకి సిఎం కేసీఆర్‌

ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ రాబోతున్నారు. ఆయనను కలిసేందుకు విముఖత చూపుతున్న సిఎం కేసీఆర్‌ ఈ రోజు ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితో సమావేశమయ్యి, బిజెపియేతర కూటమి ఏర్పాటు గురించి చర్చిస్తారు. మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కాగానే సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ చేరుకొంటారు. 

సిఎం కేసీఆర్‌ శుక్రవారం మహారాష్ట్రలో రాలేగావ్ సిద్ధికి వెళ్ళి అక్కడ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సమావేశమవుతారు. అక్కడి నుంచి షిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శించుకొని హైదరాబాద్‌ తిరిగి వస్తారు. 

ఈ నెలాఖరులోపుగా బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పర్యటించి గాల్వాన్ సంఘర్షణలలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను పరామర్శించి, వారికి ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం అందజేస్తారు. బిహార్, పశ్చిమ బెంగాల్ పర్యటన ఇంకా ఖరారు కావలసి ఉంది.