
బిజెపి హిందుత్వ అజెండాగా పనిచేసే మతతత్వ పార్టీ అని అందరికీ తెలుసు. అయితే ఆ పార్టీ దేశంలోని కోట్లాది మంది హిందువులకు ఏమి మేలు చేసిందో తెలియదు కానీ వారిలో భావోద్వేగాలు రెచ్చగొట్టి వారి ఓట్లు మాత్రం దండుకొంటుంది. అందుకు ఏకైక మార్గంగా మైనార్టీ నేతలను, మసీదులు మదర్సాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుంటుంది.
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అదే చేశారు. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో ఆయన మాట్లాడుతూ, “దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు కట్టారు. అందుకే ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయి. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. కనుక తెలంగాణలో కూడా మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయి. తవ్వకాలలో శివలింగాలు బయటపడితే మావి... శవాలు బయటపడితే మీవి. అసదుద్దీన్ ఓవైసీ..మసీదులు తవ్వెందుకు సిద్ధమేనా?” అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉగ్రవాద కేంద్రాలుగా మారిన మదర్సాలన్నిటినీ మూసి వేయిస్తామని, ఉర్దూ భాషను శాస్వితంగా రద్దు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు సమీపంలో ఉన్న దర్గాలు, మసీదులు అన్నిటినీ తొలగిస్తామని బండి సంజయ్ అన్నారు. మైనార్టీలకు రిజిస్ట్రేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు కేటాయిస్తామని అన్నారు.
మత మార్పిడులు చేస్తే మక్కెలు విరగదీస్తాం. లవ్ జిహాదీ అంటే లాఠీ దెబ్బల రుచి చూపిస్తా. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తామని బండి సంజయ్ అన్నారు. హిందువుల కోసం తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్దమని బండి సంజయ్ అన్నారు.