కాంగ్రెస్‌కి కపిల్ సిబాల్ గుడ్ బై!

దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబందం పెనవేసుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 16న రాజీనామా చేశానని స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ గాంధీల చేతిలో నుంచి విముక్తి లభించనంతకాలం ఆ పార్టీకి భవిష్యత్‌ ఆగమ్యగోచరంగానే ఉంటుందని కపిల్ సిబాల్ కుండ బద్దలు కొట్టారు. 

వచ్చే నెలలో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా ఈరోజు రాజ్యసభ సీటుకి నామినేషన్ కూడా వేసి కాంగ్రెస్ అధిష్టానానికి మరో పెద్ద షాక్ ఇచ్చారు. 

అయితే, కాంగ్రెస్ పార్టీ ఆయనను మళ్ళీ యూపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు తగినంతమంది ఎమ్మెల్యేలు లేకపోవడం,  రెండేళ్ళుగా జైలులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అంజాద్ ఖాన్‌కు బెయిల్‌పై విడుదలయ్యేలా చేసినందుకే అఖిలేష్‌ యాదవ్‌ ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కపిల్ సిబాల్ సూచించినట్లుగా  కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు చేస్తున్నప్పటికీ, రాజ్యసభ సీటు కోసం ఆశపడి ఇన్నేళ్ళ అనుబంధాన్ని పుట్టుకున తెంచుకొని వెళ్లిపోయారని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

కపిల్ సిబాల్ ఏ కారణంతో పార్టీని వీడినప్పటికీ, సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న మరికొందరు సీనియర్లు త్వరలోనే పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది.