
ప్రధాని నరేంద్రమోడీ గురువారం హైదరాబాద్ రానున్నారు. నగరంలో ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బి) 20వ వార్షికోత్సవం, హైదరాబాద్ మరియు మొహాలీ ఐఎస్బి పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్దుల స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు. నగరంలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఈవిదంగా సాగుతుంది.
• గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకొంటారు.
• విమానాశ్రయ ఆవరణలో రాష్ట్ర బిజెపి నేతలతో 15 నిమిషాలు సమావేశమవుతారు.
• బేగంపేట నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయు)కి చేరుకొంటారు. అక్కడి నుంచి 2 కిమీ దూరంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్‌కి రోడ్డు మార్గంలో చేరుకొంటారు.
• మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల వరకు ఐఎస్బి వార్షికోత్సవం, స్నాతకోత్సవ కార్యక్రమాలలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొని విద్యార్దులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు.
• సాయంత్రం 4 గంటలకు మళ్ళీ హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు ఇష్టపడని సిఎం కేసీఆర్ ఆయన రాక మునుపే బెంగళూరు వెళ్ళిపోతున్నారు. కనుక గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా రాష్ట్ర బిజెపి నేతలు ప్రధాని నరేంద్రమోడీకి బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలకనున్నారు. హెచ్‌సీయూ నుంచి ఐఎస్బీ వరకు రోడ్డుకి ఇరువైపులా ప్రధానికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయం, హెచ్సీయు, ఐఎస్బి పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని భద్రతా సిబ్బంది నిన్ననే ఐఎస్‌బిని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని అణువణువు జల్లెడ పడుతున్నారు. ఐఎస్బి విద్యార్ధులలో ప్రధాని నరేంద్రమోడీని, బిజెపిని వ్యతిరేకించేవారు ఎవరైనా ఉన్నారా? తెలుసుకొనేందుకు వారి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా పరిశీలిస్తున్నారు. సీపీ సీవీ ఆనంద్ ప్రధాని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.