ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సజావుగానే సాగిపోయింది కానీ కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లా పేరును డా.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంపై ఆ జిల్లాలో ఉవ్వెత్తున ఆందోళనలు మొదలయ్యాయి. ఈరోజు సాయంత్రం అమలాపురంలో వేలాదిగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు.
మొదట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు కానీ అక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో వారు అమలాపురం, బ్యాంక్ కాలనీలోని మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటిపై, హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై రాళ్ళతో దాడి చేశారు. పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు కానీ ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మంత్రి, ఎమ్మెల్యేలను వారి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు. దీంతో వారి ఇళ్ళను ఆందోళనకారులకు అప్పగించినట్లయింది. వారు ఇళ్ళకు, ఇళ్ళ బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో అదనపు బలగాలను రప్పించి పట్టణమంతా మోహరించారు.
ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందిస్తూ, “మొదట మేము కోనసీమ జిల్లా అని పేరు పెడితే ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు జిల్లాకు డా.అంబేద్కర్ పేరు కూడా జోడిస్తే ఆ మహనీయుడిని గౌరవించుకొన్నట్లు ఉంటుందని వినతి పత్రాలు ఇవ్వడంతో వారి అభ్యర్ధన మేరకే జిల్లా పేరును మార్చాము తప్ప ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు. జిల్లాకు ఆ మహనీయుడి పేరు పెడితే సంతోషించాలి కానీ ఈ విదంగా విధ్వంసానికి పాల్పడటం సరికాదు. జిలా ప్రజలందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అల్లర్లపై లోతుగా విచారణ జరిపించి ఈ అల్లర్ల వెనుక ఉన్న సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేస్తాము,” అని అన్నారు.