హత్య కేసులో ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ను ఓ హత్య కేసులో కాకినాడ పోలీసులు సోమ్ సాయంత్రం అరెస్ట్ చేశారు. తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్‌ గొడవపడి విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. 

అయితే ఆ హత్యను కప్పిపుచ్చుకొనేందుకు దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు, చనిపోయిన సుబ్రహ్మణ్యం మృతదేహానికి గాయాలు చేసాడని కాకినాడ ఎస్పీ రవీంద్రనాధ్ బాబు తెలిపారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మరణించాడని అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పి, తెల్లవారుజామున 2 గంటలకు మృతదేహాన్ని తన కారులో వేసుకొని అతని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నించారని చెప్పారు. కానీ అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ను పట్టుకొని బందించబోతే, అతను తన కారును అక్కడే వదిలి పారిపోయాడని ఎస్పీ తెలిపారు. 

అప్పటి నుంచి పరారీలో ఉన్న అతని కోసం గాలించి అరెస్ట్ చేసి కేసు నమోదు చేసామని తెలిపారు. సోమవారం సాయంత్రం అతనిని అరెస్ట్ చేసి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ పై జైలుకి తరలించామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాధ్ బాబు తెలిపారు.