9.jpg)
సిఎం కేసీఆర్ నిన్న చంఢీగఢ్‌లో పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలకు చెందిన 693 రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. దీనిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందిస్తూ, “ తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును కేసీఆర్ పంజాబ్‌లో రైతులకు పంచిపెట్టడం దేనికి? నేటికీ తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. కానీ వారిని సిఎం కేసీఆర్ పరామర్శించరు.
రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలుచేయలేదు. ఆరోగ్యశ్రీ పధకానికి, పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బు ఉండదు కానీ పంజాబ్‌లో రైతులకు డబ్బు పంచిపెడున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వరి రైతులు నష్టానికి అమ్ముకొంటున్నారు. అకాలవర్షాలకు ధాన్యం తడిసిపోతే వారిని ఆదుకొనే నాధుడే లేడు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించినవారిని ఇంతవరకు సిఎం కేసీఆర్ పరామర్శించలేదు. ఇంటర్ విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటే వారి కుటుంబాలను పరామర్శించలేదు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 317 కారణంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకొంటే వారి కుటుంబాలను పరామర్శించరు. కానీ ఎక్కడో పంజాబ్‌లో రైతులను పరామర్శించి వారికి అండగా నిలబడతామని చెపుతున్నారు.
ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే సిఎం కేసీఆర్ దేశాటనకి, ఆయన కుమారుడు కేటీఆర్ విదేశీయాత్రలకు వెళ్ళిపోయారు. ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి వస్తుంటే ఆయనకు స్వాగతం పలకాలనే సంస్కారం కూడా లేదు,” అని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.