ఢిల్లీ శివారులో ఏడాదిపాటు సాగిన రైతుల ఉద్యమంలో పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలకు చెందిన 693 మంది రైతులు మరణించారు. ఆదివారం చంఢీఘడ్లోని టాగూర్ ఆడిటోరియంలో వారి కుటుంబాలకు సిఎం కేసీఆర్ రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించినప్పుడు, రైతులందరూ పోరాడి వాటిని వెనక్కు తీసుకొనేలా చేశారు. ఆ పోరాటం, దానిలో మీ త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. రైతు ఉద్యమంలో చనిపోయినవారిని తిరిగి తీసుకురాలేము కానీ మీ కష్టాన్ని పంచుకోగలము. అందుకే తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ ఆర్ధికసాయం అందజేస్తున్నాము.
కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక విదానాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాలని ఒత్తిడి చేస్తోంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని మా ప్రభుత్వంపై చాలా ఒత్తిడి చేసింది. కానీ మా ప్రాణం పోయినా మీటర్లు పెట్టబోమని అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ చెప్పాము.
తెలంగాణ ఏర్పడక మునుపు మా రైతులు కూడా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ నిత్యం అనేకమంది ఆత్మహత్యలు చేసుకొనేవారు. కానీ మేము అధికారంలోకి వచ్చాక విద్యుత్ సమస్యను శాశ్వితంగా పరిష్కరించి, సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు బంధు వగైరాలు అందిస్తూ మా రైతులకు అండగా నిలబడ్డాము. కేంద్రంలో కూడా ఇటువంటి రైతు అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడే వ్యవసాయ సంబందిత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గిట్టుబాటు ధరలకు చట్టబద్దత కల్పించడం కోసం దేశవ్యాప్తంగా రైతులు మరోసారి గట్టిగా పోరాడక తప్పదు. రైతులు తలుచుకొంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. అని రాష్ట్రాలు కూడా రైతు ఉద్యమాలకు అండగా నిలబడాలి,” అంటూ సిఎం కేసీఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేస్తుంది.