అరవింద్‌ కేజ్రీవాల్‌ను సిఎం కేసీఆర్‌ ఒప్పించగలిగితే

తెలంగాణ సిఎం కేసీఆర్‌ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో తన నివాసంలో బస చేసి ఉన్నారు. కొద్ది సేపటి క్రితమే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆయన నివాసానికి రాగా సిఎం కేసీఆర్‌ ఆయనకు అఖిలేష్‌ యాదవ్‌కు శాలువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. వారిరువురూ దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బిజెపికి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై ఏవిదంగా ముందుకు సాగాలనే అంశాలపై చర్చించనున్నారు. 

సిఎం కేసీఆర్‌తో పాటు ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, జోగినపల్లి సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. 

సిఎం కేసీఆర్‌ వారితో కలిసి ఆదివారం చంఢీఘడ్ చేరుకొని, అక్కడ నాలుగు రోజుల పాటు బస చేస్తారు. ఏడాదిపాటు ఢిల్లీ శివారులో జరిగిన రైతు ఉద్యమంలో మరణించిన 600 మంది రైతుల కుటుంబాలకు సిఎం కేసీఆర్‌ ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందజేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్‌  కేజ్రీవాల్‌, పంజాబ్‌ సిఎం భగవంత్ మాన్‌ కూడా పాల్గొంటారు. 

ఢిల్లీ సిఎం అరవింద్‌  కేజ్రీవాల్‌, పంజాబ్‌ సిఎం భగవంత్ మాన్‌ కూడా బిజెపి వ్యతిరేక కూటమిలో భాగస్వాములు అయ్యేందుకు అంగీకరిస్తే, ఆ దిశలో సిఎం కేసీఆర్‌ మరో అడుగు పడినట్లే భావించవచ్చు.