
నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో మా పార్టీ పోటీ చేస్తుంది. మా అంచనాల ప్రకారం కనీసం 30 స్థానాలలో మా పార్టీకి బలం ఉంది. వాటిలో కనీసం 15 స్థానలైనా గెలుచుకోగలమని భావిస్తున్నాము. కనుక ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలలో మా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను రూపొందించుకొంటాము.
తెలంగాణ రాజకీయాలలో సామాజిక మార్పు కోరుకొంటున్నాను. వారసత్వ రాజకీయాలకు, వంశపాలనకు నేను వ్యతిరేకం. రాష్ట్రంలో కొత్త తరం నాయకత్వం రావలసిన అవసరం ఉంది. అది బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినవారైతే మంచిదని భావిస్తున్నాను,” అని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర మెగాహీరోలకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి మరెవరూ రాజకీయాలలో లేకపోవడం పవన్ కళ్యాణ్‌కు బాగా కలిసొచ్చే అంశమనే చెప్పవచ్చు. కనుక తన అభిమానులతో సహా మెగా హీరోల అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్వైపే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ వారి ఓట్లను రాబట్టుకోవడంలో విఫలం అవుతున్నారు. గత ఏపీ శాసనసభ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం, ఆ పార్టీ నేతలందరూ ఓడిపోవడమే ఇందుకు నిదర్శనం. కనుక మెగా అభిమానుల ఓట్లు తమకు ఎందుకు పడటం లేదో పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం చాలా అవసరం. లేకుంటే వచ్చే ఎన్నికలలో కూడా ఆయన సభలు, రోడ్ షోలకు అభిమానుల హడావుడి, చప్పట్లు మాత్రమే మిగులుతుంటాయి.