గూట్లో రాయితీయలేనోడు... ఈటల విమర్శలు

తెలంగాణ సిఎం కేసీఆర్‌ నేటి నుంచి వారం రోజులపాటు దేశాటనకు బయలుదేరడంపై ఊహించినట్లే విమర్శలు మొదలైపోయాయి. 

హుజూరాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానన్నట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించలేకపోయిన సిఎం కేసీఆర్‌, దేశాన్ని ఉద్దరిస్తానంటూ ప్రజాధనం ఖర్చు చేస్తూ విమానం వేసుకొని దేశాటన చేయడం చాలా ఆక్షేపనీయం. ప్రజలు కూడా దీనిని అసహ్యించుకొంటున్నారు. 

తెలంగాణలో పింఛన్లు నెలనెలా ఇవ్వలేకపోతున్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ఆలస్యం అవుతోంది. చివరికి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండేవారికి బిల్లులు చెల్లించడం లేదు. ఇంటిపన్నులు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారు. 

ఢంకా రాష్ట్రంగా చేతికి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. ఎన్ని అప్పులు చేస్తున్నా సరిపోకపోవడంతో మద్యం ధరలు కూడా పెంచాల్సివచ్చింది. రాష్ట్రంలో ఇంత అధ్వాన పరిస్థితులకు కారణమైన సిఎం కేసీఆర్‌, దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరడం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అని ఈటల రాజేందర్‌ తీవ్రంగా విమర్శించారు.