19.jpg)
తెలంగాణ సిఎం కేసీఆర్ నేటి నుంచి ఆరు రోజులపాటు దేశంలో వివిద రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీలో రెండు రోజులు బిజేపీయేతర పార్టీలతో, ప్రముఖ ఆర్ధిక నిపుణులతో, జాతీయ మీడియా ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతారు. ఈ సమావేశాలలో దేశ ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ కొరత, పెరుగుతున్న ధరలు, దేశాభివృద్ధి, బిజెపికి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు అవసరం తదితర అంశాల గురించి చర్చిస్తారు.
మే 22 మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి చంఢీఘడ్ చేరుకొంటారు. ఏడాదిపాటు ఢిల్లీ శివారులో జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్, హర్యానా, యూపీలకు చెందిన 600 మంది రైతు కుటుంబాలకు తలో రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందజేస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో డిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ కూడా పాల్గొంటారు.
మే 26న బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామిలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్రలోయి రాలేగావ్ సిద్ధి గ్రామానికి వెళ్ళి అక్కడ నివశిస్తున్న ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్ తిరిగి వస్తారు.
మళ్ళీ ఈ నెలాఖరులోగా పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో పర్యటించి గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలో వీరమరణం పొందిన భారతీయ జవాన్ల కుటుంబాలను పరామర్శించి రూ.5 లక్షల ఆర్ధికసాయం చెక్కు రూపంలో అందజేస్తారు.