టిఆర్ఎస్ గేట్లు తెరిస్తే చాలు లోపలకి ప్రవేశించాలనుకొనేవారే రాష్ట్రంలో ఎక్కువ. కానీ టిఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళేవారు చాలా అరుదు. అటువంటి అరుదైన నేతలు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జెడ్పీ ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి దంపతులు.
వారిద్దరూ ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్ళి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. వారికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నప్పుడు నల్లాల ఓదెలు సిఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు. 2009, 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా చెన్నూరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ప్రభుత్వ విప్‌గా కూడా పనిచేశారు. ఆయన భార్య భాగ్యలక్ష్మికి జెడ్పీ ఛైర్ పర్సన్‌గా మరో రెండేళ్ళ పదవికాలం ఉంది.
రేపు వారు హైదరాబాద్, గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము టిఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడవలసి వచ్చిందో తెలియజేస్తారు.