నేడు లండన్ పర్యటనకు బయలుదేరుతున్న మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నేడు లండన్, స్విట్జర్‌లాండ్ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరుతారు. మంత్రి కేటీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అధికారులు లండన్, దావోస్ పర్యటనకు వెళుతున్నారు. 

వారు లండన్‌లో మూడు రోజులుండి అక్కడి పారిశ్రామికవేత్తలు, వివిద సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమవుతారు. తెలంగాణలో ఏర్పాటైన పరిశ్రమలు, సంస్థలు, వాటికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, సహాయ సహకారాల గురించి వారికి వివరించి రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటు చేయాలని కోరనున్నారు. 

మూడు రోజుల లండన్ పర్యటన ముగించుకొన్న తరువాత వారి బృందం అక్కడి నుంచి దావోస్‌కు చేరుకొని ఈనెల 22 నుంచి 26వరకు జరుగబోయే ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొంటారు. ఆ సదస్సుకి హాజరయ్యే వివిద దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంస్థలు, ఐటి కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో కేటీఆర్‌ బృందం వరుసగా సమావేశమయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. 

మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనలకు వెళ్ళి వచ్చిన ప్రతీసారి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నారు. కనుక ఈసారి లండన్, దావోస్ పర్యటనలతో కూడా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువస్తారని ఆశించవచ్చు.