బండికి మంత్రి కేటీఆర్‌ లీగల్ నోటీస్!

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ ఈరోజు లీగల్ నోటీస్ పంపించారు. ఈ నెల 11వ బండి సంజయ్‌ రాష్ట్రంలో 27 మంది ఇంటర్మీడియెట్ విద్యార్దుల ఆత్మహత్యలకు మంత్రి కేటీఆరే కారణమని ఆరోపిస్తూ ఓ ట్వీట్ చేశారు. 

దానిపై మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ, “ఆ ఆరోపణలను నిజమని నిరూపించు లేదా క్షమాపణలు చెప్పమని కోరారు. ఒకవేళ రెండూ చేయలేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కానీ బండి సంజయ్‌ తన ఆరోపణలను నిరూపించే ఎటువంటి సాక్ష్యాలు చూపలేదు. మంత్రి కేటీఆర్‌ను క్షమాపణ కూడా కొరకపోవడంతో ఇవాళ్ళ తన లాయర్ ద్వారా బండి సంజయ్‌కి లీగల్ నోటీస్ పంపారు. దానికి 48 గంటలలో సమాధానం ఇవ్వాలని కోరారు. లేకుంటే ఈ కేసు కోర్టుకు వెళుతుందని తెలియజేశారు.

మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు చాలా కాలంగా బండి సంజయ్‌ను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరికి ఇవాళ్ళ లీగల్ నోటీస్ పంపించవలసి వచ్చింది. దీనిపై బండి సంజయ్‌ ఇంకా స్పందించవలసి ఉంది. 

ఒకవేళ బండి సంజయ్‌ తన ఆరోపణలను రుజువు చేసేందుకు కొనైనా సాక్ష్యాధారాలు చూపగలిగితే ఈ కేసులో నుంచి బయటపడగలరు లేదా ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదని సమాధానం చెపితే కోర్టులో ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు.