బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ లాస్ట్ వార్నింగ్

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ నిన్న లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రలో నిన్న కోనాయిపల్లిలో ప్రజలతో మాట్లాడుతూ, “గత ఏడాది 27 మంది ఇంటర్మీడియెట్ విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. సిఎం కేసీఆర్‌ కుమారుడు మంత్రి కేటీఆర్ నిర్వాకం వలననే పిల్లలు చనిపోయారు. కొండగట్టు ప్రమాదంలో పేదలు చనిపోయారు. ఆర్టీసీ సమ్మెలో అనేక మంది కార్మికులు చనిపోయారు. కానీ వారి కుటుంబాలను సిఎం కేసీఆర్‌ పరామర్శించలేదు. కనీసం వారి గురించి మాట్లాడలేదు. అదే పెద్దోళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మాత్రం సిఎం కేసీఆర్‌ పూలదండలు పట్టుకొని వెళ్ళి పరామర్శించి వస్తారు,” అని అన్నారు. 

“మంత్రి కేటీఆర్‌ నిర్వాకం వలననే 27 మంది ఇంటర్మీడియెట్ విద్యార్దులు మరణిస్తే కనీసం స్పందించని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కేసీఆర్‌..” అంటూ బండి సంజయ్‌ ఓ ట్వీట్ కూడా చేశారు. 

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ వెంటనే చాలా ఘాటుగా స్పందిస్తూ, “బిఎస్ కుమార్, మీరు ఈ దుష్ప్రచారం ఆపకపోతే నేను మీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మీరు నాపై చేసిన ఆరోపణలకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే వెంటనే వాటిని ప్రజల ముందుంచండి లేదా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి,” అని హెచ్చరిస్తూ బండి సంజయ్‌ తనపై ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేశారు.