5.jpg)
మంత్రి శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికలలో తన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించిన తరువాత, దానిలో తప్పులు దొర్లినట్లు గుర్తించి వాటిని సరిదిద్దేందుకు సిబ్బంది సాయంతో ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌ను టాంపరింగ్ చేశారనే ఫిర్యాదు వచ్చింది. దానిపై లోతుగా దర్యాప్తు జరిపిన కేంద్ర ఎన్నికల కమీషన్ అటువంటిదేమీ జరగలేదని చెపుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.
అభ్యర్ధులు నాలుగు సెట్లు నామినేషన్లు వేస్తే వాటిలో ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకొన్న ఒక్క సెట్ మాత్రమే అధికారిక వెబ్సైట్లో కనిపిస్తుందని మిగిలిన సెట్స్ కనిపించకుండా ఉంచేస్తామని తెలిపింది. కనుక వాటిని టాంపరింగ్ చేయడం, వెబ్సైట్లో నుంచి తొలగించడం సాధ్యం కాదని ఈసీ పేర్కొంది. కనుక శ్రీనివాస్ గౌడ్‌పై చేసిన ఆరోపణలు నిజం కావని, ఆయన ఎటువంటి నేరం చేయలేదని ఈసీ తెలిపింది. ఈ మేరకు ఈసీ జారీ చేసిన వివరణ మెమో కాపీలను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావుకు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వికాస్ రాజుకు, మంత్రిపై ఫిర్యాదు చేసిన చ్. రాఘవేంద్ర రాజుకు పంపించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు మీడియాకు తెలియజేశారు.