
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ వాటి అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకొంటోంది. వాటిలో పోలీస్ శాఖ కూడా ఒకటి. తొలి సంవత్సరంలోనే పోలీసు వ్యవస్థలో పలు సంస్కరణలు చేసి వ్యవస్థ ఆధునీకరణకు అనేక చర్యలు చేపట్టింది. వాటిలో భాగంగా రూ.585 కోట్లు వ్యయంతో బంజారాహిల్స్లో రోడ్ నం.12లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సదుపాయాలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్ నిర్మిస్తోంది. దీని నిర్మాణపనులు దాదాపు పూర్తి కావచ్చాయి.
మంగళవారం ఆయన రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. మరో మూడు నెలల్లో దీనిని ప్రారంభిస్తామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ మీడియాకు చెప్పారు.
ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసిన 9.21 లక్షల సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతున్న దృశ్యాలను ఇక్కడి నుంచే చూడవచ్చు. ఒకేసారి లక్ష సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతున్న దృశ్యాలను చూసేందుకు వీలుగా ఇక్కడ భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అన్ని పోలీస్స్టేషన్లతో ఈ పోలీస్ టవర్స్ అనుసంధానమై ఉంటుంది కనుక ఎక్కడ ఏమి జరుగుతోందో క్షణంలో తెలిసిపోతుంటుంది. అవసరమైనప్పుడు హైదరాబాద్ నుంచే రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అధికారులతోనైనా నేరుగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కనెక్ట్ కావచ్చు. దేశంలోనే ఇది అతి పెద్ద, అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పోలీస్ కార్యాలయమని మంత్రి చెప్పారు.