
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు ఈరోజు ఉదయం కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ సంబందించిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆ స్కూల్ ప్రిన్సిపల్ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరినీ ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈసారి పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రశ్నాపత్రాలు లీక్ అవడం, ప్రభుత్వోపాధ్యాయులే దగ్గరుండి విద్యార్దుల చేత మాస్ కాపీయింగ్ చేయిస్తూ పట్టుబడి జైలుకి వెళ్ళడం వంటి పరిణామాలతో ఏపీ ప్రభుత్వం పరువు పోయింది. ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి, వామపక్షాలు దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండటంతో ఆత్మరక్షణలో పడింది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన నారాయణకు చెందిన విద్యాసంస్థలలో నుంచే పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు పోలీసులు గుర్తించి ఇవాళ్ళ నారాయణను అరెస్ట్ చేయడంతో వైసీపీ ప్రభుత్వం బంతిని టిడిపి కోర్టులో వేసింది. కనుక మళ్ళీ ఇప్పుడు నారాయణ అరెస్ట్ అంశంపై టిడిపి-వైసీపీల మద్య మరో కొత్త యుద్ధం ప్రారంభం కాబోతోంది.