బిజెపికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి షరతులు?

గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ కాంగ్రెస్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఆయన మొన్న మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. దీంతో ఆయన బిజెపిలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 

వాటిపై ఆయన స్పందిస్తూ, “సిఎం కేసీఆర్‌ నిరంకుశపాలనను అంత మొందించడమే నా ఏకైక లక్ష్యం. అందుకు ఏ పార్టీ సమర్ధమైనదని భావిస్తే దానితో కలిసి పనిచేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి అనే నేను నమ్ముతున్నాను. కానీ టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఆవినీతి, అక్రమాల చిట్టా బిజెపి వద్ద ఉందని బండి సంజయ్‌ చెపుతున్నప్పుడు, కేంద్రప్రభుత్వం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తోంది?ఈ విషయంలో బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవలసి ఉంది. ఇందుకోసం నేను మరో నెల రోజులు వేచి చూడాలనుకొంటున్నాను. 

ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకొంటుందని నాకు నమ్మకం కలిగితే నేను బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నాను. నాతో పాటు మరో 30 మంది సీనియర్ నేతలు కూడా బిజెపిలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ టిఆర్ఎస్‌పై పోరు విషయంలో బిజెపి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఒకవేళ ఈ విషయంలో బిజెపి విఫలమైతే టిఆర్ఎస్‌ను గద్దె దించేందుకు మరో కొత్త పార్టీ స్థాపించవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను,” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.