కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవలసిన ఖర్మ మాకేమిటి?

కాంగ్రెస్‌ అధినేత రాహుల్ గాంధీ నిన్న హనుమకొండ సభలో అవినీతిలో మునిగితేలుతున్న టిఆర్ఎస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకోమని, ఒకవేళ పార్టీలో ఎవరైనా టిఆర్ఎస్‌తో పొత్తుల గురించి మాట్లాడితే వెంటనే బయటకు పంపించేస్తామని హెచ్చరించారు. 

రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవలసిన ఖర్మ మాకేమిటి?మాతో పొత్తులు పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీని ఏమైనా అడిగామా? కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీతో అసలు దేశంలో ఏ పార్టీ అయినా పొత్తులు పెట్టుకోవాలనుకొంటుందా?మీ సొంత నియోజకవర్గంలోనే ఓ ఎంపీ సీటు గెలిపించుకోలేని మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారంటే ఎవరైనా నమ్ముతారా? 

హైదరాబాద్‌ మీ గాంధీభవన్‌ను ఓ గాడ్సే చేతిలో పెట్టేశాక ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది?ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఇక్కడ చదవడం కాదు. మీ పార్టీ అన్ని విదాల నాశనం చేసి విడిచిపెట్టిన తెలంగాణ రాష్ట్రాన్నిఈ ఏడేళ్ళలో మేము ఎంతగా అభివృద్ధి చేశామో చూసి మాట్లాడితే బాగుంటుంది. 

వరంగల్‌ డిక్లరేషన్‌లో కొత్తగా మీరు చెప్పిందేమిటి? 2018లో చేపినవే మళ్ళీ దానిలో కూడా చెప్పారు కదా? మీ కాంగ్రెస్‌ పరిపాలన ఏవిదంగా ఉంటుందో అందరూ చూశారు. మళ్ళీ మరోసారి కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసే పరిస్థితి లేదు,” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

మంత్రి కేటీఆర్‌ చెప్పినవి అక్షరాల నిజమే. అయితే ప్రశాంత్ కిషోర్‌ చెపుతున్నట్లుగా ఒకవేళ వచ్చే లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటే అప్పుడు కూడా టిఆర్ఎస్‌ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటుందా?