6.jpg)
తమ అధినేత రాహుల్ గాంధీని ఎలాగైనా చంచల్ గూడ జైలుకి పంపాలన్న కాంగ్రెస్ నేతల ముచ్చట తీరింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ పెద్దలందరూ స్వయంగా రాహుల్ గాంధీని కారులో చంచల్ గూడ జైలుకి తీసుకువచ్చి లోపలకి సాగనంపారు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా లోపలకు వెళ్ళారు.
కాంగ్రెస్ నేతలు తమ అధినేత రాహుల్ గాంధీని జైలుకి పంపించడం ఏమిటనుకొంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే..
రాహుల్ గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో ముఖాముఖి సమావేశం కావాలనుకొన్నారు. కానీ అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించడంతో ఎన్ఎస్యుఐ విద్యార్ధులు యునివర్సిటీలో నిరసనలు తెలిపారు.
దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వారిని తమ అధినేత యూనివర్సిటీలో కలిసేందుకు ఎలాగూ అనుమతించలేదు కనుక కనీసం జైలులోనైనా వారిని కలిసేందుకు అనుమతించాలని కాంగ్రెస్ నేతలు జైలు సూపరింటెండెంట్ ను కోరారు. కానీ అయన కూడా మొదట అనుమతి నిరాకరించారు. అయితే కాంగ్రెస్ నేతలు పదేపదే విజ్ఞప్తి చేయడంతో రాహుల్ గాంధీతో కేవలం ఇద్దరిని మాత్రమె లోపలకి అనుమతిస్తామని చెప్పారు.
కనుక కాంగ్రెస్ నేతలు పట్టుబట్టి పోరాడి చివరికి తమ అధినేత రాహుల్ గాంధీని చంచల్ గూడా జైలులోకి పంపించగలిగారు. ఆయన లోపలకు వెళ్లి వారితో ఏమి మాట్లాడారో తెలీదు కానీ ఆయన కోసం ఈరోజు మిగిలిన ఖైదీల ములాఖాత్ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయవలసి వచ్చింది. అలాగే రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా జైలు చుట్టుపక్కల ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ తన పర్యటన ముగించుకొని మళ్ళీ ధిల్లీ తిరిగి వెళ్ళిపోతారు.