
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న హనుమకొండ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జరిగిన ‘రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్, టిఆర్ఎస్ దోస్తీపై స్పష్టత ఇచ్చారు.
రాష్ట్రంలో బిజెపి నేరుగా అధికారంలోకి రాలేదు. అయితే బిజెపితో కాంగ్రెస్ ఎన్నడూ కలవదని తెలుసు. కనుక రాష్ట్రంలో మళ్ళీ టిఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకొంటోంది. అప్పుడు కేసీఆర్ ద్వారా రిమోట్ కంట్రోల్ పద్దతిలో రాష్ట్రంలో అధికారం చలాయించాలని చూస్తోంది. ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది కనుకనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
టిఆర్ఎస్తో కాంగ్రెస్ దోస్తీ అంటూ మా పార్టీపై దుష్ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్న టిఆర్ఎస్తో మేము ఎన్నటికీ పొత్తులు పెట్టుకోము. మేము నవాబు వారసులతో స్నేహం చేయం ప్రజల పక్షాన్నే ఉంది పోరాడుతాము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే ఎవరైనా టిఆర్ఎస్తో దోస్తీ అంటూ మాట్లాడితే వారు ఎంత పెద్దవారైనా తక్షణం బయటకు పంపిస్తాం అని హెచ్చరించారు.
కనుక ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్కు పనిచేస్తున్నా దానార్దం టిఆర్ఎస్, కాంగ్రెస్‌లు దగ్గరవుతున్నట్లు కాదని, తమ పార్టీకి అటువంటి ఉద్దేశ్యం కూడా లేదని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పడంతో రాష్ట్ర కాంగ్రెస్‌కు ఈవిషయంలో పూర్తి స్పష్టత వచ్చింది.