రాహుల్‌ని జైలుకి కూడా అనుమతించరా?

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ మరికొద్ది సేపటిలో హైదరాబాద్‌ చేరుకొంటారు. ఆయన రేపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దులతో సమావేశం అవ్వాలనుకొన్నారు కానీ యూనివర్సిటీ అధికారులు అంగీకరించకపోవడంతో ఎన్‌ఎస్‌యుఐ విద్యార్దులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఓయూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి చంచ‌ల్‌గూడ జైలుకి తరలించారు. 

కనుక రాహుల్ గాంధీ వారిని మూలాఖాత్ ద్వారా అక్కడైనా కలిసేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు జైలు సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వకంగా కోరారు. కానీ దానికీ జైలు సూపరింటెండెంట్‌ అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “విద్యార్దులు తమ అధినేతతో మాట్లాడాలనుకొంటేనే జైలులో పెడతారా? జాతీయస్థాయి నాయకుడైన రాహుల్ గాంధీ వారిని కలిసేందుకు జైలుకి వచ్చేందుకు సిద్దపడినా అంగీకరించారా?” అంటూ చిందులు వేశారు. కానీ జైలు సూపరింటెండెంట్‌ మాత్రం అనుమతించేది లేదని స్పష్టంగా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక వెనక్కు తిరిగారు.