రాహుల్ గాంధీకి టిఆర్ఎస్‌ రిటర్న్ గిఫ్ట్

గత ఏడాది సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌ మాదకద్రవ్యాల వ్యవహారం కలకలం సృష్టిస్తునప్పుడు, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు వైట్‌హౌస్‌-ఛాలెంజ్ అంటూ ఓ సవాలు విసిరారు. మేము మాదక ద్రవ్యాలు సేవిస్తున్నామో లేదో తెలుసుకొనేందుకు పరీక్ష చేయించుకొనేందుకు సిద్దంగా ఉన్నాము. మరి తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీరు కూడా మా ఈ వైట్‌-ఛాలెంజ్‌ని స్వీకరించి వైద్య పరీక్షలకు వస్తారా?”అంటూ ఆనాడు సవాలు విసిరారు. 

ఇప్పుడు టిఆర్ఎస్‌ నేతలు దానినే కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్ గాంధీకి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. నేడు ఆయన రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌తో సహా కొన్ని ప్రాంతాలలో పోస్టర్స్ ఏర్పాటు చేశారు. దానిలో రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్బులో ఓ చైనా యువతితో కలిసి పార్టీ చేసుకొంటున్న ఫోటోలు పెట్టి, రాహుల్ గాంధీ వైట్‌-ఛాలెంజ్‌కి సిద్దమేనా? అంటూ కింద వ్రాశారు.