
తెలంగాణలో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే కాంగ్రెస్, బిజెపిల అగ్రనేతలు రాష్ట్ర పర్యటనలకు వచ్చేస్తున్నారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం మహబూబ్‌నగర్‌లో బిజెపి అధ్వర్యంలో బహిరంగ సభ జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్ రానున్నారు.
మే 6వ తేదీన వరంగల్‌లో కాంగ్రెస్ అధ్వర్యంలో జరుగబోయే రైతు సంఘర్షణ సభలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారు. ఆ మర్నాడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది కానీ ఓయూ అధికారులు అనుమతి నిరాకరించడంతో అమరవీరుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈనెల 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగే బిజెపి బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా వస్తున్నారు.
ఈ సభలలో పాల్గొనే కాంగ్రెస్, బిజెపి జాతీయ నేతలు సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం తధ్యం. కనుక టిఆర్ఎస్-కాంగ్రెస్-బిజెపిల మద్య మాటల యుద్ధం మొదలవుతుంది. మే నెలలో రాష్ట్రంలో ఎండలతో పాటు రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతుంది.