నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ స్నేహితుడి పెళ్ళి సందర్భంగా ఓ నైట్ క్లబ్బులో పార్టీలో పాల్గొన్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఓ చైనా యువతితో సన్నిహితంగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె నేపాల్‌లోని చైనా ప్రభుత్వ ప్రతినిధి అని సమాచారం. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ ఖాట్మండులో ఉన్నట్లు దృవీకరించడంతో అది ఫేక్ వీడియో కాదని స్పష్టమైంది. దీంతో బిజెపి నేతలు రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. 


బిజెపి ఐ‌టి కన్వీనర్ అమిత్ మాలవీయ స్పందిస్తూ, “ఓ పక్క కాంగ్రెస్ పార్టీ విచ్చినం అయిపోతుంటే రాహుల్ గాంధీ పార్టీ గురించి ఆలోచించకుండా నైట్ క్లబ్బులో చిందేస్తున్నారు...అయినా ఎక్కడ తొణకకుండా స్థిరంగా నిలబడున్నారు గ్రేట్,” అంటూ ఎద్దేవా చేశారు.

బిజెపి నేత కపిల్ శర్మ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, “ఈ వీడియోలో రాహుల్ గాంధీ పక్కన ఉన్నది ఎవరు? ఆయన వ్యక్తిగత జీవితంపై మాకు ఆసక్తి లేదు కానీ విదేశంలో ఓ చైనా ఏజంటుతో అంత సన్నిహితంగా ఉంటే ప్రశ్నించక తప్పదు,” అని ట్వీట్ చేశారు. 

బిజెపి విమర్శలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జెవాలా కూడా ధీటుగా స్పందించారు. “ఓ మిత్రుడి పెళ్ళికి వెళ్ళి ఆ వేడుకలలో పాల్గొనడం కూడా బిజెపి నేతల దృష్టిలో నేరమేనా? బహుశః బందుమిత్రుల పెళ్ళిళ్ళు, వేడుకలకు హాజరవడంపై కూడా మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందేమో?ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఆహ్వానిస్తే రాహుల్ గాంధీ ఆ పెళ్ళికి హాజరయ్యారు తప్ప ప్రధాని నరేంద్రమోడీ పిలవని పేరటానికి పాకిస్థాన్‌ వెళ్ళినట్లు మా నాయకుడు వెళ్ళలేదు. మా పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి బిజెపికు ఎందుకు చింత?” అని ప్రశ్నించారు.  

కాంగ్రెస్‌ తమ నాయకుడు రాహుల్ గాంధీని ఎంతగా సమర్ధించుకొన్నప్పటికీ, ఆయన పొరుగు దేశంలో ఓ నైట్ క్లబ్బులో చైనా యువతితో కనబడటాన్ని ప్రజలు కూడా తప్పు పట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు గ్రహించినట్లు లేదు.