ఐఏఎస్ అధికారిణి స్మితకు హైకోర్టు జలక్

తెలంగాణ సీఎంవోలో తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి, సిఎం కేసీఆర్‌కు కార్యదర్శిగా పని చేస్తున్న స్మితా సభర్వాల్‌కు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఏడేళ్ళ క్రితం ఓ స్టార్ హోటల్లో జరిగిన ఫ్యాషన్ షోకు ఆమె తన భర్తతో కలిసి హాజరయ్యారు. ఆ న్యూస్‌ని అవుట్ లుక్ పత్రిక కవర్ చేస్తూ ఓ వివాదాస్పద కధనం ప్రచురించింది. దానిపై ఆమె అభ్యంతరం తెలుపుతూ ఆ పత్రికపై హైకోర్టులో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. 

ఈ కేసుకు సంబందించి ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.15 లక్షలు మంజూరు చేసింది. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మెడకు, ఆమె మెడకు చుట్టుకొంది. 

ఆ ఫ్యాషన్ షో అధికారిక కార్యక్రమం కానప్పుడు, ఆమె వ్యక్తిగతంగా హాజరైనట్లవుతుంది. అప్పుడు ఆ పత్రిక వ్రాసిన దానిపై ఆమెకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సొంత ఖర్చుతో న్యాయపోరాటం చేయాలి కానీ ప్రజా ప్రయోజనం కేసు పేరుతో ప్రభుత్వం ఆమెకు రూ.15 లక్షలు చెల్లించడం సరికాదని, దాని కోసం ప్రభుత్వం జీవో జారీ చేయడం రాజ్యాంగ విరుద్దమని ఔట్ లుక్ ప్రతినిధులు, మరో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ప్రజా ప్రయోజన పిటిషన్‌లు హైకోర్టులో దాఖలు చేశారు. 

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్‌ షావిలలో కూడిన ద్విసభ్య హైకోర్టు ధర్మాసనం, పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ, “స్మితా సభర్వాల్-అవుట్ లుక్ మద్య జరుగుతున్న న్యాయపోరాటం ఓ ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు మద్య జరుగుతున్నదే తప్ప దీంతో ప్రభుత్వానికి సంబందం లేదు. కనుక దీనిలో ప్రజా ప్రయోజనాలు కూడా లేవు. దీని కోసం ప్రభుత్వం జీవో జారీ చేసి కోర్టు ఖర్చుల నిమిత్తం నిధులు మంజూరు చేయడం తగదు. 

కనుక ఆమె మూడు నెలల్లోగా ప్రభుత్వానికి రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలి. ఒకవేళ ఆమె చెల్లించకపోతే మరో 30 రోజులలో ప్రభుత్వమే ఆమె నుంచి వసూలు చేసి ఆ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలి,” అని హైకోర్టు తీర్పు చెప్పింది.