ఓయులో రాహుల్ గాంధీ ముఖాముఖీపై సస్పెన్స్

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో ముఖాముఖీ సమావేశం కావాలనుకొన్నారు. కానీ ఓయూ అధికారులు ఈ సమావేశానికి అనుమతి నిరాకరించారు. దీంతో ఎన్‌ఎస్‌యుఐ తరపున మానవ్ రాయ్, ప్రతాప్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

రాహుల్ గాంధీ పర్యటనకు కేవలం 5 రోజులే సమయం ఉన్నందున, నేటి నుంచి హైకోర్టు వేసవి సెలవులు మొదలవుతున్నందున తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని వారు హైకోర్టును అభ్యర్ధించారు. 

ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్‌ రెడ్డి ఈ పిటిషన్‌పై మే 5లోగా జవాబివ్వాలని ఆదేశించారు. కానీ ఈరోజు మధ్యాహ్నమే ఓయూ అధికారులు లిఖితపూర్వకంగా తమ సమాధానాన్ని హైకోర్టుకు సమర్పించారు. 

ప్రస్తుతం ఓయూలో అధ్యాపక సంఘాల ఎన్నికలు, విద్యార్దులకు పరీక్షలు జరుగుతున్నాయని కనుక ఈ సమయంలో ఓయూలో ఇటువంటి రాజకీయ సమావేశాలకు అనుమతించదలచుకోలేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. అయినా ఓయూ క్యాంపస్‌లో రాజకీయ సభలు, సమావేశాలను అనుమతించడం సరికాదని భావిస్తున్నామని ఓయూ అధికారులు హైకోర్టుకి తమ అభిప్రాయం తెలియజేశారు. 

యూనివర్సిటీ అధికారుల నుంచి వెంటనే సమాధానం వచ్చినప్పటికీ ఈ కేసు తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసినందున అప్పుడే హైకోర్టు తుది నిర్ణయం చెపుతుందా లేక ఈలోగానే చెపుతుందా అనేది మంగళవారం తెలియవచ్చు.