భారత్‌ ఆర్మీ ఛీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే

భారత్‌ ఆర్మీ ఛీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే శనివారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేస్తున్న జనరల్ ఎంఎం నరవణే నేడు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. జనరల్ మనోజ్ పాండే 1982లో కోర్ ఆఫ్ ఇంజనీర్స్‌గా ఆర్మీలో ప్రవేశించి అప్పటి నుంచి వివిద హోదాలలో భారత్‌ ఆర్మీలో పనిచేస్తున్నారు.

జనరల్ మనోజ్ పాండే జమ్ముకశ్మీర్‌, పశ్చిమ, ఈశాన్య సెక్టార్‌లలో ఇంజనీరింగ్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు. జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ పరాక్రమ్‌లో ఆయనకీలక పాత్ర పోషించారు. అలాగే నియంత్రణ రేఖ వెంబడి ఇన్‌ఫ్యాంట్రీ దళానికి, లద్దాక్‌ పర్వత ప్రాంతాలలో గస్తీ దళాలకు నాయకత్వం వహించారు. 

భారత్‌ ఆర్మీలో ఇంజనీరింగ్ విభాగం నుంచి ఈ అత్యున్నతమైన పదవి చేపడుతున్న తొలి వ్యక్తి జనరల్ మనోజ్ పాండే. 2022, ఫిబ్రవరి 1న ఆర్మీ వైస్ ఛీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే నేడు ఆర్మీ ఛీఫ్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. 

ఓ పక్క చైనా, మరోపక్క పాకిస్థాన్‌ నుంచి నిత్యం సవాళ్ళు ఎదురవుతున్న ఈ సమయంలో ఆర్మీ ఛీఫ్‌గా పనిచేయడం నిజంగా పెద్ద సవాలే. కానీ ఆర్మీలో అపారమైన అనుభవం ఉన్న జనరల్ మనోజ్ పాండే ఈ సవాళ్లను ధీటుగానే ఎదుర్కోగలరని భావించవచ్చు.