అవును... ఏపీలో రోడ్ల దుస్థితి అలాగే ఉంది: నారాయణ

తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్‌ నిన్న ఏపీలో నీళ్ళు, రోడ్లు, కరెంట్ పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతుంటే, ప్రతిపక్ష నేతలు కేటీఆర్‌ వ్యాఖ్యలను సమర్ధిస్తుండటం విశేషం. 

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చిత్తూరు జిల్లా, నగరి మండలంలో తన స్వగ్రామం ఆయనంబాకం రోడ్లు దారుణంగా గుంతలు పడ్డాయని, ఇక చిత్తూరు జిల్లాను తమిళనాడు జిల్లాలతో కలిపే రోడ్లైతే ఇంకా దారుణంగా ఉన్నాయని చెపుతూ, ఆ రోడ్ల ఫోటోలు, వీడియోలను మీడియాకు చూపారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకి ఏపీలో రోడ్లకి ఎక్కడా పొలికే లేదని ఎద్దేవా చేశారు. 

ఇక విద్యుత్‌ కోతల గురించి మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కూడా నారాయణ సమర్ధించారు. ఏపీలో ఎప్పుడు ఎంతసేపు విద్యుత్‌ ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను నిర్మాణాత్మకమైన సూచనగా స్వీకరించి ఏపీ ప్రభుత్వం ఇకనైనా ఈ కరెంట్ కష్టాలు తీర్చి, రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేసి ఏపీ ప్రజలకు ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలని హితవు పలికారు. 

టిడిపికి చెందిన మరో మాజీ మంత్రి స్పందిస్తూ, “ఒక్క తెలంగాణ రాష్ట్రం ఏమిటి...ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ గురించి ఇదే చెపుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభువ్తాలు తమ ప్రజలకు ఏపీలో పరిస్థితిని పోల్చి చూపుతూ, ఏపీ కంటే మన రాష్ట్రమే అన్ని విదాల బాగుందని చెప్పుకొంటున్నాయి,” అని అన్నారు.