కేంద్రానికి అత్యవసర చికిత్స చేయక తప్పదు: కేసీఆర్‌

పవిత్ర రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌, ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ విందులో పాల్గొన్న సిఎం కేసీఆర్‌ మజ్లీస్‌ ఎంపీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి స్వయంగా పండు తినిపించి విందు భోజనం వడ్డించారు. పిల్లలకు రంజాన్ తోఫా (బహుమతి)లు పంచిపెట్టారు. 

అనంతరం విందుకు హాజరైన ముస్లిం పెద్దలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ,” తెలంగాణ ఏర్పడక మునుపు అన్నిటికీ ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఈ ఏడున్నరేళ్ళలో ఆ సమస్యలన్నీ శాస్వితంగా పరిష్కరించుకోవడమే కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశంలో అగ్రస్థానంలో ఉన్నాము. మీ అందరి సహాయ సహకారాలతోనే ఇదంతా సాధ్యమైంది. 

దేశంలో నేడు అనేక రాష్ట్రాలలో విద్యుత్‌ లేక అంధకారంలో ఉంటే మన తెలంగాణ రాష్ట్రం మాత్రం విద్యుత్‌ కాంతులతో ధగధగ మెరిసిపోతోంది. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయి కానీ కేంద్రంలో పరిస్థితే బాగోలేదు. కనుక కేంద్రానికి అత్యవసర చికిత్స చేయవలసి ఉంది. రాష్ట్రాన్ని బాగుచేసుకొన్నట్లే దేశాన్ని బాగుచేసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కనుక నేను చొరవ తీసుకొని ప్రయత్నించాలనుకొంటున్నాను,” అని అన్నారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిద కార్యక్రమాల గురించి వివరించారు. 

ఈ విందు కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ ఆలీ, త‌ల‌సాని శ్రీనివాస్, కొప్పుల ఈశ్వ‌ర్‌, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.