
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కె. రోజా శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్కు వచ్చి సిఎం కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం తీసుకొన్నారు. అనంతరం ఆమె బయట మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అని నేను భావించడం లేదు. కానీ ఒకవేళ ఆయన మా రాష్ట్రం గురించే అని ఉంటే నేను వాటిని ఖండిస్తున్నాను. సిఎం కేసీఆర్ దంపతులు నన్ను సొంత కూతురిలా భావించి చాలా అభిమానంగా ఆశీర్వదించారు. రాజకీయంగా నేను ఇంకా పైకి ఎదగాలని ఆహ్వానించారు. వారి కుమార్తె కవిత కూడా నన్ను చాలా ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.
మా సిఎం జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రంలో అవినీతి రహితంగా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ మూడేళ్ళలో మా సిఎం జగన్మోహన్ రెడ్డి నాడు-నేడు కార్యక్రమం క్రింద పాఠశాలలు, ఆస్పత్రులు వగైరా అన్నిటినీ ఎంతగానో అభివృద్ధి చేశారు.
మా రాష్ట్రంలో రోడ్లు బాగోవని కేటీఆర్కు చెప్పిందెవరో తెలియదు కానీ ఆయనను వెంటపెట్టుకొని మా రాష్ట్రానికి రావాలని పర్యాటక శాఖ మంత్రిగా నేను కేటీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు వస్తే నేను మా రోడ్లు, సచివాలయ వ్యవస్థ, మా సంక్షేమ పధకాలు అమలవుతున్న తీరు అన్ని స్వయంగా చూపిస్తాను. నచ్చితే తెలంగాణ రాష్ట్రంలో కూడా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు,” అని అన్నారు.