
టిఆర్ఎస్ నేతలకు జీహెచ్ఎంసీ జరిమానాలు విధించింది. మొన్న బుదవారం టిఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాలలో నిబందనలకు విరుద్దంగా టిఆర్ఎస్ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటుచేసినందుకు ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి పిర్యాదులు పోటెత్తాయి. దీంతో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు భారీగా జరిమానాలు విధించింది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ. 2 లక్షలు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌కు రూ.1 లక్ష, కాలేరు వెంకటేష్‌కు రూ.50 వేలు జరిమానాలు విధించింది. ఇంకా మరికొందరు టిఆర్ఎస్ నేతలకు కూడా కలిపి మొత్తం రూ.10 లక్షల పైన జరిమానాలు విధించింది.
నగరంలో ఫ్లెక్సీ బ్యానర్లపై ఆంక్షలు ఉన్నప్పుడు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలే ఈవిదంగా నిబందనలను బేఖాతరు చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ నేతలు నగరమంతా ఫ్లెక్సీ బ్యానర్లు పెడుతుంటే పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు, కాంగ్రెస్ బ్యానర్లను పెట్టకమునుపే అడ్డుకొంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే ప్రతీసారి టిఆర్ఎస్ భారీగా బ్యానర్లు పెడుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు వారిని అడ్డుకొనే ధైర్యం చేయలేక ప్రజలు పిర్యాదులు చేసినప్పుడు ఈవిదంగా తూతూ మంత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిపోయింది.
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సైతం తమ పార్టీ నేతలను వారించకపోవడం శోచనీయం. ఒకవేళ తమ పార్టీకి మినహాయింపు ఉందని భావిస్తున్నట్లయితే, కాంగ్రెస్, బిజెపి తదితర ప్రతిపక్షాలను కూడా బ్యానర్లు పెట్టుకోవడానికి అనుమతించాలి కదా?