తెలంగాణ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, హేమంత్ భేటీ

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కుటుంబంతో కలిసి గురువారం హైదరాబాద్‌ వచ్చి ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ను కలిశారు. వారికి సిఎం కేసీఆర్‌ దంపతులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాలపై సుదీర్గంగా చర్చించుకున్నారు. కేంద్రప్రభుత్వం బిజెపియేతర రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతూ ప్రజల మద్య మత చిచ్చు పెడుతోందని, కనుక బిజెపియేతర పార్టీలన్నీ కలిసికట్టుగా కేంద్రంతో పోరాడవలసిన అవసరం ఉందని వారు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా విపక్షాలను కూడగట్టి వాటి  తరపున రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టాలని వారు భావించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే బిజెపియేతర పార్టీలు, ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

సిఎం కేసీఆర్‌ గత నెల 4వ తేదీన కుటుంబ సమేతంగా ఝార్ఖండ్ రాజధాని రాంచికి వెళ్ళి హేమంత్ సొరేన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ పర్యటించవలసిందిగా సిఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు నిన్న ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్ కూడా కుటుంబంతో కలిసి వచ్చి నిన్న ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.