తాండూరు ఎమ్మెల్యే వెర్సస్ ఎమ్మెల్సీ ఫైట్ మద్యలో సీఐ!

వికారాబాద్ జిల్లా తాండూరులో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మద్య చిరకాలంగా జరుగుతున్న కోల్డ్ వార్ బుదవారం బయటపడింది. ఇటీవల తాండూరులో జరిగిన భావిగీ భద్రేశ్వర జాతరలో రధోత్సవం జరిగింది. దానిలో పాల్గొన్న పట్నం మహేందర్ రెడ్డిని కాదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పోలీసులు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడారు. అయితే ఆయన వచ్చే ఎన్నికలలో తనకే తప్పకుండా పార్టీ టికెట్ లభిస్తుందని చెప్పడంతో ఇది ఇరువురి మద్య టికెట్ కోసం జరుగుతున్నా పోరాటమని స్పష్టమైంది.

పట్నం మహేందర్ రెడ్డి తన పట్ల అనుచితంగా మాట్లాడటం గురించి సీఐ రాజేందర్ రెడ్డి ఎస్పీ కోటిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు పట్నం మహేందర్ రెడ్డిపై పోలీసులు సెక్షన్స్ 353,504,506 కింద కేసు కూడా నమోదు చేశారు. 

దీంతో పట్నం మహేందర్ రెడ్డి మరింత ఆగ్రహంతో ఇదంతా రోహిత్ రెడ్డే వెనకుండి చేయిస్తున్నాడని, సీఐ రాజేందర్ రెడ్డి అతనికి తొత్తులా మారడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మళ్ళీ సీఐ రాజేందర్ రెడ్డి స్పందిస్తూ, “నేను ఎవరికీ తొత్తును కాను. ఆ అవసరం నాకు లేదంటూ,” ఘాటుగా జవాబిచ్చారు. 

రోహిత్ రెడ్డి కూడా స్పందిస్తూ, “పట్నం మహేందర్ రెడ్డి మనసులో ఏదో పెట్టుకొని నా గురించి చెడ్డగా మాట్లాడటం సరికాదు. ఇంత జరిగినా నేను ఈ విషయం గురించి ఇంతవరకు సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌కి ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు తప్పకుండా వారి దృష్టికి తీసుకువెళతాను,” అని అన్నారు.