తెలంగాణ రాష్ట్రంలాగే దేశమంతా అభివృద్ధి చెందాలి: కేసీఆర్‌

ఈరోజు మాదాపూర్ హెచ్ఐసిసిలో జరుగుతున్నా టిఆర్ఎస్‌ ప్లీనరీ సభలో సిఎం కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసంలో తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర రాజకీయ పరిస్థితి, దేశాభివృద్ధి, దాని కోసం అజెండా, ఫ్రంట్ ఏర్పాటు, అవసరం గురించి వివరించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు క్లుప్తంగా...

·  తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్‌ పార్టీ కాపలాదారు వంటిది. ప్రజల ఆకాంక్షల మేర పనిచేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తోంది. టిఆర్ఎస్‌ ఓ వ్యక్తిదో... శక్తిదో కాదు. యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి.   అదేవిదంగా తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్‌కు కంచుకోట వంటిది. వీటిని ఎవరూ బద్దలుకొట్టలేరు.

· ఒకప్పుడు తెలంగాణలో పాలమూరు జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది, ఇక్కడ పుష్కలంగా పనులు, ఉద్యోగాలు దొరుకుతున్నందున ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు, ఉపాది పొందుతున్నారు.  

· తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్. మన కృషి, పట్టుదలకు నిదర్శనంగా నేటి తెలంగాణ మన కళ్ళ ముందే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఇస్తున్న అవార్డులే ఓ ప్రత్యక్ష నిదర్శనం.   

· రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే చిత్తశుద్ధి, తపన, దూరదృష్టి, సామర్ధ్యం అన్నీ ఉంటే ఏ రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రంలాగా అభివృద్ధి చెందుతుంది. దేశాన్ని కూడా ఇదేవిదంగా అభివృద్ధి చేసుకోవచ్చు.

· దేశంలో ప్రజల మద్య మతచిచ్చు రగిలించి విద్వేషాలు రెచ్చగొట్టడం, కత్తులు, తుపాకుల గురించి మాట్లాడటం వలన దేశం ఇంకా నష్టపోతుందే తప్ప అభివృద్ధి చెందదు. దేశానికి కావలసింది విద్యుత్, తాగు, సాగునీరు, ఉద్యోగాలు, ఉపాది, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే.

· ఈ విద్వేషం ఏ స్థాయికి వెళ్ళిందంటే జాతిపిత మహాత్మా గాంధీజీని సైతం దూషించేవరకు. ఇదేనా మన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే గౌరవం?

· రాజకీయ ప్రయోజనాల కోసం సర్జికల్ స్ట్రైక్స్ చేసి వాటి గురించి ప్రచారం చేసుకోవడం, దేవుడి పేరు మీద యాత్రలు, కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు తీస్తున్నారు తప్ప వీటితో దేశం ఏమైపోతుందని ఆలోచించడం లేదు.

· ఆనాడు ఎన్టీఆర్‌ హయం నుంచి నేటి వరకు దేశంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతూనే ఉంది.

· ప్రపంచంలో అగ్రదేశంగా నిలబడగల సామర్ధ్యం, వనరులు భారత్‌కు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు వాటిని సమర్ధంగా వినియోగించుకోలేకపోవడం వలననే భారత్‌ ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోతోంది.

· భారత్‌ అభివృద్ధికి సరికొత్త ఆర్ధిక, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు రూపొందించుకోవలసిన అవసరం ఉంది. వాటిని  తెలంగాణ రాష్ట్రమే రూపొందించి దేశానికి అందిస్తుండటం మన అందరికీ గర్వకారణం.