టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ఓ శుభవార్త! వారికి 5 శాతం డీఏ ఇవ్వాలని టీఎస్‌ఆర్టీసీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న 48,000 మంది ఉద్యోగులతో పాటు 2019 నుంచి రిటైర్ అయిన వారికి కూడా ఈ డీఏ పెంపు వర్తిస్తుందని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పెంచిన డీఏ వచ్చే నెల వేతనాలతో కలిపి అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ పెంపుతో డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్ (శ్రామిక్) స్థాయి ఉద్యోగులకు నెలకు రూ.600 నుంచి రూ.1,500 వరకు జీతాలు పెరగవచ్చు. ఆ పైస్థాయి అధికారులకు నెలకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు జీతాలు పెరగవచ్చు. దీంతో టీఎస్‌ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల అదనపు ఆర్ధికభారం పడుతుందని అధికారులు తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ ఇంకా నష్టాలలోనే ఉన్నప్పటికీ ఉద్యోగుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొనట్లు తెలిపారు.
దీంతో మూడేళ్ళుగా నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళే తప్ప ఇటువంటి చిన్న శుభవార్త వినేందుకు నోచుకోని టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమకు ఆరు డీఏలు బాకీ ఉండగా వాటిలో ఇప్పుడు ఒకటి మాత్రమే చెల్లిస్తున్నందుకు అసంతృప్తిగా ఉన్నప్పటికీ, సంస్థ పరిస్థితి వారికీ తెలుసు కనుక దీంతోనే సంతృప్తి పడక తప్పదని అంటున్నారు.