కేసీఆర్‌-ప్రశాంత్ కిషోర్‌ భేటీపై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ ఓ పక్క కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ, ఆ పార్టీలో చేరేందుకు కూడా సిద్దపడుతూ, తెలంగాణ సిఎం కేసీఆర్‌తో రెండు రోజులు వరుసగా సుదీర్గంగా సమావేశం కావడంపై కాంగ్రెస్‌ శ్రేణులు అయోమయానికి గురవుతుండటంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నడుం బిగించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రశాంత్ కిషోర్‌ టిఆర్ఎస్‌ పార్టీకి పనిచేయలేనని చెప్పేందుకే సిఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన కూడా నాతో కలిసి రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపునివ్వబోతున్నారు. ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మా అధిష్టానం ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలి తప్ప కాదని టిఆర్ఎస్‌ కోసం పనిచేయలేరు. కనుక రాబోయే రోజుల్లో టిఆర్ఎస్‌ పార్టీతో, ప్రశాంత్ కిషోర్‌ ఏర్పాటు చేసిన ఐప్యాక్‌తో ప్రశాంత్ కిషోర్‌కు ఎటువంటి సంబందామూ ఉండబోదు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపుణే పనిచేస్తారు,” అని అన్నారు.   

అయితే రేవంత్‌ రెడ్డి చెప్పిన దాంట్లో టిఆర్ఎస్‌ పార్టీతో, ఐప్యాక్‌తో ప్రశాంత్ కిషోర్‌కు ఎటువంటి సంబందమూ ఉండబోదనే మాట ఆలోచించవలసిన విషయమే. అంటే ప్రశాంత్ కిషోర్‌ టిఆర్ఎస్‌ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ, ఐప్యాక్ స్వతంత్రంగా పనిచేస్తుంది కనుక అది సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉందని రేవంత్‌ రెడ్డి చెప్పకనే చెపుతున్నారు. అయితే ఆయన ఊహిస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరుతారా? చేరి కాంగ్రెస్‌ అధిష్టానానికి వినయంగా పనిచేస్తారా? అప్పుడు దాని సూచన మేరకు తెలంగాణలో టిఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తారా?అంటే అన్ని అనుమానంగానే కనిపిస్తున్నాయి.  

సిఎం కేసీఆర్‌ హటాత్తుగా రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్‌ను తెరపైకి తీసుకురావడం సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, ఆయన రాకతో టిఆర్ఎస్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగవచ్చు. కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్‌ భేటీ అవుతుండటంతో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌లు చేతులు కలపబోతున్నాయనే అనుమానాలు రేకెత్తించినట్లయింది. దీనిని బిజెపి తెలివిగా ఉపయోగించుకోవడం ఖాయం.