
సినిమా మద్య మద్యలో కామెడీ సీన్స్ పెడుతుంటారు. అవి లేకపోయినా సినిమా అసలు కధకు ఇబ్బంది ఉండదు. కానీ ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇవ్వడానికి వాటిని జోడిస్తుంటారు. రాజకీయాలలో కూడా అప్పుడప్పుడు అటువంటి కామెడీ నేతలు, కామెడీ సీన్స్ పండిస్తుంటారు. అటువంటివారే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
శనివారం ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి మంచి రాజకీయ కామెడీ పండించారు. అదేమిటో ఆయన మాటల్లోనే..
• తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని నమ్మబట్టే అప్పుడు నేను మద్దతు ఇచ్చాను.
• రెండు తెలుగు రాష్ట్రాలకు నేను లక్షల కోట్లు నా ఛారిటీ సంస్థల నుంచి విరాళంగా ఇచ్చాను.
• నేను అంగీకరిస్తే బిజెపి నాకు రాజ్యసభ సీటు ఇచ్చి, ఉప ప్రధాని పదవి ఇస్తానంది కానీ నేనే అంగీకరించలేదు.
• ఈ భూప్రపంచంలో నాఅంత గొప్ప పలుకుబడి కలిగిన వ్యక్తి మరొకరు లేరు.
• నా బ్యాక్ గ్రౌండ్ తెలుసు కనుకనే ప్రధాని నరేంద్రమోడీ, సిఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సిఎం కేసీఆర్ నన్ను చూసి భయపడుతుంటారు.
• కేసీఆర్ దేశమంతా కాళ్ళు అరిగేలా తిరిగినా పార్టీల మద్దతు కూడగట్టలేకపోయారు. కానీ నేను అలా అలా తిరిగి 18 పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చాను. మిగిలిన పార్టీలను కూడా కలుపుకు పోయెందుకు త్వరలో నేను దేశాటన చేస్తాను.
• వచ్చే ఎన్నికలలో మా ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72 సీట్లు, ఏపీలో 102 సీట్లు వస్తాయి. రెండు చోట్ల మా పార్టీయే అధికారంలోకి వస్తుంది. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల కష్టాలు నేను తీర్చేస్తాను.