కొత్త సచివాలయాన్ని పరిశీలించిన సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కొత్త సచివాలయాన్ని పరిశీలించారు. సిఎం కేసీఆర్‌ సచివాలయమంతటా తిరిగి నిర్మాణ పనులను పరిశీలిస్తూ వాటికి సంబందించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సచివాలయంలో ప్రతీ అంతస్తులో ధారాళంగా గాలి, వెలుతురు వస్తుండటంతో ‘వెంటిలేషన్ చాలా బాగుందని’ సిఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయం కోసం రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెడ్‌ స్టోన్‌ పలకల నాణ్యతను, వాటిపై డిజైన్లు, వాటిని గోడలకు అమర్చుతున్న తీరును నిశితంగా పరిశీలించి, అధికారులకు కొన్ని సూచనలు చేశారు. తరువాత లిఫ్టులు, వాటి సామర్ధ్యం గురించి సిఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. సచివాలయం భవన నిర్మాణ పనులకు సమాంతరంగా సచివాలయం చుట్టూ మట్టి పని కూడా పూర్తిచేసి మొక్కలు నాటి ల్యాండ్  స్కేపింగ్ పనులను కూడా చేపట్టాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. 

ఈ ఏడాది దసరానాటికి సచివాలయంలో అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని రేయింబవళ్లు జోరుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సచివాలయం తెలంగాణ ప్రజలందరూ గర్వపడేవిదంగా గొప్పగా తీర్చి దిద్దాలని సిఎం కేసీఆర్‌ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. 

 సిఎం కేసీఆర్‌ వెంట మంత్రి వేముల, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్, శేషాద్రి, హైదరాబాద్‌ సిపి సివి ఆనంద్, సచివాలయాన్ని నిర్మిస్తున్న షాపూర్‌ జీ పల్లోంజీ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు.