బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌ మహా నగరంలో మరో ఫ్లైఓవర్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పాతబస్తీ పరిధిలోని బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను మంత్రులు కేటీఆర్‌, మహమూద్ ఆలీ మజ్లీస్‌ అధినేత, ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి మంగళవారం ఉదయం ప్రారంభోత్సవం చేశారు.  

అనంతరం వారు పాతబస్తీ పరిధిలో రూ.495.75 కోట్లు విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ముర్గీ చౌక్, మీర్ ఆలంమండి (మార్కెట్‌), కాలపత్తర్ పోలీస్‌స్టేషన్‌, ఛార్మినార్ వద్దగల సర్ధార్ మహల్ పునర్నిర్మాణ పనులకు వారు నేడు శంకుస్థాపనలు చేశారు. తరువాత మీర్ ఆలం చెరువులో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్‌కు ప్రారంభోత్సవం చేశారు. 

వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూ.69 కోట్లు వ్యయంతో బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను నిర్మించారు. బహదూర్‌పురా నుంచి జంతు ప్రదర్శనశాల వరకు 780 మీటర్ల పొడవు, ఆరు లేన్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీంతో ఆరాంఘర్ నుంచి ఎల్బీ నగర్‌ వైపు వెళ్ళే వాహనాలకు చాలా సౌకర్యతంగా ప్రయాణించవచ్చు.  

మీర్ ఆలం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్‌ నగరానికి మరో కొత్త ఆకర్షణగా నిలువబోతోంది. ముఖ్యంగా పాతబస్తీవాసులకు సాయంత్రం ఇక్కడ ఆహ్లాదకరంగా గడపవచ్చు. నలబై మీటర్లు పొడవుండే ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్‌లో మొత్తం 26 పంపులు ఉన్నాయి. వాటన్నిటినీ కంప్యూటర్‌తో అనుసంధానించడంతో  రంగరంగు విద్యుదీపాల నడుమ సంగీతానికి అనుగుణంగా లయబద్దంగా 36 అడుగుల ఎత్తు వరకు నీళ్ళు విరజిమ్ముతూ ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి.