
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తనపై తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేనెప్పుడూ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని బెదిరించలేదు. అసలు అటువంటి ఆలోచన, అవసరం నాకు లేదు. కానీ కొందరు మంత్రులు పాత వీడియోలతో నన్ను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేశారు. నేను రాజకీయాలు చేస్తున్నానని ఆరోపిస్తున్నారు. నేను కేవలం ఓ గవర్నర్గా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో నివశిస్తున్న గిరిజనుల కష్టానష్టాలను తెలుసుకొని నా పరిధిలో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. అంతే! నేను ప్రజలను కలుసుకొంటే తప్పనుకొంటే ఎలా?
కేంద్రానికి ప్రతినిధిగా ఉండే నేను రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇచ్చిన వినతి పత్రాలను, రాష్ట్రంలో నా దృష్టికి వచ్చిన విషయాలను కేంద్రప్రభుత్వానికి నివేదించడం నా బాధ్యత. అదే నేను చేస్తున్నాను. నాకు ఎటువంటి రాజకీయ అజెండా లేదు. రాష్ట్ర ప్రభుత్వం నన్ను గౌరవించినా, గౌరవించకపోయినా నా పని నేను చేసుకుపోతుంటాను. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. ఒకవేళ గౌరవించకపోయినా మహిళలు ఆత్మనిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ముందుకుసాగాలని కోరుకొంటాను. ఇక ప్రోటోకాల్ వివాదం గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు. దానిపై కేంద్రమే స్పందిస్తుంది,” అని అన్నారు.