.jpg)
సింగరేణి బొగ్గు బ్లాకులను కేంద్రప్రభుత్వం వేలంవేసి ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్ఎస్, దాని అనుబంద కార్మిక సంఘం టిబిజికేఎస్ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.
ఈరోజు ఉదయం సింగరేణి కోల్ బెల్టులో బీఎంఎస్ కార్మిక చైతన్య యాత్రను ప్రారంభిస్తూ, “సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే దానిని నిలువునా ముంచేస్తోంది. లాభాలలో నడుస్తున్న సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యంతోనే సమస్యలు మొదలయ్యాయి. సింగరేణి కార్మికులు తమ ప్రాణాలు, ఆరోగ్యం పణంగాపెట్టి బొగ్గు తవ్వితీసి ఆదాయం సమకూర్చుతుంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం దానిని ఇష్టారీతిన వాడుకొంటోంది. అందుకే వేలకోట్లు ఆదాయం వస్తున్నప్పటికీ సింగరేణి కార్మికుల జీతాల కొరకు సంస్థ యాజమాన్యం ఎప్పటికప్పుడు అప్పులు చేస్తోంది. సింగరేణి సొమ్మును సిఎం కేసీఆర్ తన పార్టీ ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాలలో ఖర్చు చేస్తున్నారు. సింగరేణిలో కల్వకుంట్ల కవితకు ఏం పని?ఆమె టిబిజికేఎస్ గౌరవాధ్యక్షురాలుగా చేరినప్పటి నుంచే సింగరేణిలో కార్మిక సంఘాలను కూడా టీఎస్ఆర్టీసీలా మెల్లగా నిర్వీర్యం చేస్తున్నారు. వేరే సంఘాలలో ఉన్న కార్మికులను అధికారులు వేధిస్తున్నారు. సింగరేణిలో ప్రభుత్వ జోక్యం పెరుగుతున్న కొద్దీ సంస్థ మునిగిపోతుంది కనుక సింగరేణి కార్మికులు బీఎంఎస్ను బలపరచవలసిందిగా కోరుతున్నాను,” అని ఈటల రాజేందర్ అన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలలో టిఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడు సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో టిబిజికేఎస్ను కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దపడుతున్నట్లు కనిపిస్తోంది. కనుక సింగరేణి వేదికగా టిఆర్ఎస్, బిజెపిల మద్య మరోసారి హోరాహోరీ యుద్ధం తప్పదని భావించవచ్చు.