టిఆర్ఎస్‌ నేత తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్‌ నేత తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో ఓ విషాద ఘటన జరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు సిద్దమవుతున్న ఆయన కుమార్తె డాక్టర్ మహాలక్ష్మి (26) ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నత చదువుల విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవడంతో ఆమె ఆత్మహత్య చేసుకొన్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో వనమా నివాసంలో గురువారం తెల్లవారుజామున ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో దమ్మపేటలో ఉన్న వెంకటేశ్వర్లుకు స్థానికులు ఫోన్‌ చేసి ఈవిషయం తెలపడంతో ఆయన సారపాక చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. 

వెంకటేశ్వర్లు అర్ధాంగి రత్నకుమారి కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో మరణించారు. వెంకటేశ్వర్లు దంపతులకు ఒక కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తె మహాలక్ష్మి విజయవాడలో ఇంటర్ చదివి, కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసారు. 

వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురువారం భద్రాచలంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.